నిప్పుతో ఆట‌లొద్దు.. పాకిస్థాన్‌కు వార్నింగ్

నిప్పుతో ఆట‌లొద్దు.. పాకిస్థాన్‌కు వార్నింగ్

జ‌మ్ము: జ‌మ్ము క‌శ్మీర్‌లో ఉగ్ర‌వాదాన్ని ఉసిగ‌ల్పాల‌ని కుట్ర‌లు చేయొద్ద‌ని, నిప్పుతో చెల‌గాటం ఆడే ఆలోచ‌న మానుకోవాల‌ని పాకిస్థాన్‌కు వార్నింగ్ ఇచ్చారు బీజేపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి త‌రుణ్ చుగ్. జ‌మ్ములో శ‌నివారం జ‌రిగిన బీజేపీ విస్తార‌క్స్ మీటింగ్‌లో ఆయ‌న పాల్గొన్నారు. జ‌మ్ము క‌శ్మీర్ బీజేపీ అబ్జర్వ‌ర్‌గా ఉన్న ఆయ‌న మాట్లాడుతూ ఇవాళ పుల్వామాలో జ‌రిగిన ఎన్‌కౌంట‌ర్‌లో ఇద్ద‌రు టెర్రిరిస్టులు హ‌త‌మ‌వ‌డం ద్వారా పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్ర‌వాదం ఇంకా జ‌మ్ము కశ్మీర్‌లో ఉంద‌న్న విష‌యం తేలింద‌న్నారు. దీనికి పాక్ భారీ మూల్యం చెల్లించుకోక త‌ప్ప‌ద‌ని హెచ్చ‌రించారు. ఇవాళ్టి ఎన్‌కౌంట‌ర్‌తో జ‌న‌వ‌రి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు 87 మంది ఉగ్ర‌వాదులు హ‌త‌మ‌య్యార‌ని, పాక్ కుట్ర‌ల‌ను ఎదుర్కొనేందుకు ఆర్మీ ఎంత ప‌టిష్టంగా ఉందో దీన్ని బ‌ట్టే తెలుసుకోవాల‌ని ఆయ‌న వార్నింగ్ ఇచ్చారు.

టెర్రరిజం కాదు.. టూరిజం కోరుకుంటున్న‌రు

టెర్ర‌ర్ అటాక్స్‌తో విసిగిపోయిన జ‌మ్ము క‌శ్మీర్ ప్ర‌జ‌లు ప్ర‌స్తుతం అభివృద్దిని కోరుకుంటున్నార‌ని, ఇప్పుడు ఇక్క‌డి ప్ర‌జ‌ల‌కు కావాల్సింది టెర్ర‌రిజం కాద‌ని, టూరిజం అని త‌రుణ్ చుగ్ చెప్పారు. గ‌త 70 ఏండ్లుగా జ‌మ్ము క‌శ్మీర్‌లో గుప్కార్ గ్యాంగ్ (నేష‌న‌ల్ కాన్ఫ‌రెన్స్, పీడీపీ, కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ స‌హా జ‌మ్ము క‌శ్మీర్‌లోని ఇత‌ర ప్ర‌తిప‌క్షాలు) చేస్తున్న దేశ వ్య‌తిరేక, హింసాత్మ‌క‌ చ‌ర్య‌లకు ఇక‌పై చోటు లేద‌న్నారు. తుపాకులు, బుల్లెట్ల‌తో ప్ర‌జ‌లు విసిగిపోయార‌ని, ఉద్యోగ అవ‌కాశాల‌తో పాటు స్కూళ్లు, ఆస్ప‌త్రులు, రోడ్లు డెవ‌ల‌ప్ కావాల‌ని కోరుకుంటున్నార‌ని చెప్పారు. ఇన్నేండ్లుగా జ‌మ్ము క‌శ్మీర్ ప్ర‌జ‌ల‌ను గుప్కార్ గ్యాంగ్ చైనా, పాక్‌ల డైరక్ష‌న్‌లో త‌ప్పుదారి ప‌ట్టించిందని త‌రుణ్ చుగ్ అన్నారు. ఇప్పుడు ప‌రిస్థితులు పూర్తిగా మారిపోయాయ‌ని, జమ్ము క‌శ్మీర్‌లో న‌వ వ‌సంతం విక‌సిస్తోంద‌ని చెప్పారు.